పోడు రైతులకు అన్యాయం జరగనివ్వం
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి):తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన, ఆదివాసీ రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట పోడు రైతులు నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. పోడు భూముల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల సమస్యను గుర్తించి లక్షలాది ఎకరాలకు హక్కు పత్రాలు అందించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు.ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సర్వేల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
విత్తనాలు వేసుకునే కీలక సమయంలో రైతుల వ్యవసాయ పనులకు ఆటంకాలు కలిగించవద్దని అటవీ శాఖ అధికారులను కోరారు. పోడు రైతుల భూములపై ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా సహించబోమని హెచ్చరించారు.పోడు రైతుల హక్కులను కాపాడేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతానని తెలిపారు. పోడు భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






