కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...
- ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం మండల, పట్టణ స్థాయి నాయకులతో జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు చేపట్టనున్న వరుస నిరసన కార్యక్రమాల వివరాలను నాయకులకు వివరించారు. పట్టణంతో పాటు అన్ని మండలాల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని జోగు రామన్న పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసినా ఎక్కడా వెనకడుగు వేసేది లేదన్నారు.
ప్రజలుఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రైతుబంధు, రైతుబీమా, ఎరువుల ధరలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, మురికివాడల సమస్యలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, బస్తీ దవాఖానాల పరిస్థితి తదితర అంశాలపై ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు.






