27 August, 2026 | 10:21 PM

గిరిజన మ్యూజియమును అన్ని హంగులతో ముస్తాబు చేస్తాం

27-08-2026 12:14 PM

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలం ఐటీడీఏ(Bhadrachalam ITDA) ప్రాంగణంలో నెలకొల్పిన గిరిజన మ్యూజియమును అతి  త్వరలో అత్యాధునిక హంగులతో చూపరులకు ఆకట్టుకునేలా రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్(B. Rahul) అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఉన్న గిరిజన మ్యూజియంను సందర్శించడానికి భద్రాచలం నుండి ఐటీడీఏ తరఫున బయలుదేరడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 ఏప్రిల్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అప్పటి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) చేతుల మీదుగా ప్రారంభించిన గిరిజన మ్యూజియం సందర్శకుల రాక గణనీయంగా పెరిగిందని అన్నారు. సంవత్సరం కాలంలోనే పర్యాటక దినోత్సవం రోజు తెలంగాణ ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా బెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగిందని, గిరిజన మ్యూజియమును పూర్తిస్థాయి హంగులతో ముస్తాబు చేయడానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపగా కోటి రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు.

కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ న్యూఢిల్లీ కార్యాలయం వారి సూచనల మేరకు మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో ఉన్న గిరిజన మ్యూజియం సందర్శించి అక్కడి మ్యూజియంను ఎటువంటి హంగులతో రూపొందించారో దాని తరహాలోనే భద్రాచలం ఐటిడిఏ గిరిజన మ్యూజియమును అన్ని హంగులతో తయారు చేయడానికి మ్యూజియం పరిశీలన కొరకు భోపాల్ కు బయలుదేరడం జరిగిందని, అక్కడ మ్యూజియంలోని కళాఖండాలు ఇతర హంగులను పరిశీలించిన మీదట దాని తరహాలోనే భద్రాచలం గిరిజన మ్యూజియంను అన్ని హంగులతో ముస్తాబు చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు ఐటిడిఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.