అణు పరీక్షలు చేస్తాం
- పాకిస్థాన్ సహా రష్యా, చైనా, ఉత్తరకొరియాలో టెస్టింగ్స్
- మావద్ద అంతకంటే ఎక్కువే ఉన్నాయి
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, నవంబర్3:ప్రపంచంలోని చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కానీ వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడలేదు.. మేం అలా కాదు.. ఏదైనా బహిరంగంగానే చేస్తాం.. దాని గురించి మాట్లాడతాం. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా మేం వాటి జోలికి వెళ్లలేదు.
ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేమే ఈ పరీక్షలు నిర్వహిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మావద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించా’ అని ట్రంప్ తెలిపారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే ఎప్పుడు ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ పేర్కొనలేదు. ఇటీవల దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటికి ముందు ‘ట్రూత్ సోషల్’లో దీనిపై పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘అణ్వాయుదాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయొద్దని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నా. కానీ ఇప్పడు పరిస్థితులు మారాయి. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణ్వాయుధాలను సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి.




