29 May, 2026 | 2:53 AM

తడిసినా కొంటాం

29-05-2026 01:46 AM
  1. మద్దతు ధర చెల్లిస్తాం 
  2. ధాన్యం తరలింపునకు ఇసుక లారీలు 
  3. ఈ నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి  
  4. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  5. యాదాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో మంత్రులు పొంగులేటి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కలిసి పర్యటన 
  6. ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష

యాదగిరిగుట్ట, మే 28 (విజయ క్రాంతి)/పెద్దపల్లి: అకాల వర్షానికి తడి సిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లిం చి, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం పెద్దపల్లి, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి పర్యటించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగ పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సమీపంలోని రామాజిపేట వద్ద గల ప్రభుత్వ గోదాములో  నిల్వ ఉంచిన ధాన్యపు నిల్వలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దపల్లి, యాదాద్రి కలెక్టరేట్‌లలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25నుంచి 30 శాతం  (మొదటి పేజీ తరువాయి)

అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 58 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇంకా 15 నుంచి 17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు చేసి బాయిలర్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు మాత్రం నష్టం జరగనివ్వబోమన్నారు.

చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులు బకాయిలు, వడ్డీలు చెల్లిస్తే తిరిగి ధాన్యం కేటాయింపులు ఇస్తామని తెలిపారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి వాహనాలను పూర్తిగా ధాన్యం రవాణాకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్‌సీఐ కేవలం 51 లక్షల టన్నులకే పరిమితమైందన్నారు. ఎఫ్‌సీఐ కేటాయింపులకు మించి అదనంగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం వర్షాల కారణంగా కేవలం 9 వేల టన్నుల ధాన్యం మాత్రమే తడిసిందని, ఆ ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి జిల్లా పర్యటనలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరశం, సామేలు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీఫెన్ రవీంద్ర, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పాల్గొన్నారు. పెద్దపల్లిలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణా రావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

కొనుగోళ్ల కోసం కార్యాచరణ: మంత్రి దుద్దిళ్ల

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సార్లు ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ ఎక్కడా ఒక్క కిలో ధాన్యానికి కూడా తరుగు పేరుతో కోత విధించలేదన్నారు. జిల్లాలో ఎక్కడైనా రైతుల నుంచి ఒక్క కేజీ ధాన్యం తరుగు తీసినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మిల్లర్ల చేత రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు. 

ఆశించిన స్థాయిలో దిగుబడులు: మంత్రి పొంగులేటి

ఈసారి రైతుల ఆశించిన స్థాయిలో పంటల దిగుబడులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంట దిగుబడులను ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం సేకరిస్తూ నగదును వారి ఖాతాలలో వెంటనే జమ చేస్తుందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30% అధికంగా జరుగుతున్నాయి. ఇప్పటివర కు 58 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించాం. 15 నుంచి 17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు మాత్రం నష్టం జరగనివ్వబోం. డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమ లు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించాం.  

 మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి