14 August, 2026 | 2:15 PM

డిండి భూ సేకరణను అడ్డుకుంటాం

14-08-2026 12:48 PM

బీఆర్‌ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డి

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) మంతటి గ్రామంలో డిండి ప్రాజెక్టు(Dindi Project) కోసం భూ సేకరణను తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఆడిట్ కెనాల్ డంపింగ్ యార్డ్ కోసం సుమారు 125 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల భూములను డంపింగ్ యార్డ్ కోసం తీసుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఎస్‌ఎల్‌బీసీతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. రైతుల భూములను తీసుకుని వారి నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతుల భూముల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తూ, ఈ సమస్యపై జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.