పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఈ నెల 28న నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జూలై 13న జరిగే జాతీయ నూలిపురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో 0 నుంచి 5 ఏళ్లలోపు 46,516 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయేందుకు 670 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్, రైల్వే స్టేషన్లలో 18 మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు.
జూలై 13న నిర్వహించే నూలిపురుగుల నివారణ కార్యక్రమంలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 1,67,702 మందికి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు అందజేస్తామని చెప్పారు. శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
:-రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎల్-1 జాబితాలో ఉన్న గుడిసెల కుటుంబాల ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మా ణం, ఉపాధి హామీ పథకం కింద గ్రామ సచివాలయ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. అర్హుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల సహకారంతో పరిశీలన చేపట్టాలని తెలిపారు.






