అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలి
మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, జూన్ 11: అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం చెన్నూర్ అటవీ రేంజ్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారి, అటవీ డివిజన్ అధికారి, గ్రామాల సర్పంచ్ లు, అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడం కోసం అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలోని మొసళ్ళ పార్క్, ఇతర ప్రాంతాలను పర్యాటకుల కోసం తీర్చిదిద్దాలని, తద్వారా పర్యాటక ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో 3,500 ఇండ్లు, 2వ విడతలో 2 వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇండ్లు నిర్మించుకునే స్తోమత లేని వారికి ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చెన్నూర్ లో 5 పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు వెళ్లకుండా స్థానికంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా 23 మంది వైద్యులతో పాటు సిబ్బందిని నియమించి వైద్య పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందించడం జరుగుతుందని, త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందని, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు 2 వేల మంది విద్యార్థులకు విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో 2 అడ్వా న్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి వి ద్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మందమర్రి పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కొనసాగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్, అధికారులతో కలిసి సందర్శించి తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు.






