వానకాలం పంటల సాగుకు సన్నద్ధం కావాలి
జిల్లా వ్యవసాయ అధికారి జె భాగ్యలక్ష్మి
కొత్తపల్లి, ఏప్రిల్ 17(విజయక్రాంతి):కరీంనగర్ ఎడిఎ కార్యాలయం లో జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వానకాలం (ఖరీఫ్) పంటల సాగుకు సంబం ధించి సమగ్ర సమీక్ష సమావేశం శుక్రవారం రోజున నిర్వహించబడింది. రాబోయే వానకాలం సీజన్కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎ ఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, వంటి సేవలు ఫార్మర్ రిజిస్ట్రీకి తప్పనిసరి అనుసంధానమై ఉంటాయని, ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి స్పష్టం చేశారు. స్థానికంగా లేని రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ సమీప మీ సేవ కేంద్రాల్లో కూడా చేసుకొవలని,వచ్చే నెలలోపు ఈ ప్రక్రియ 100% పూర్తి కావాలని ఎఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
డిజిటల్ క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని కూడా సమయానికి పూర్తి చేయాలని, ప్రతి రైతు పంట వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా భవిష్య త్తులో నష్టపరిహారం, ఇతర ప్రయోజనాలు సులభంగా అందుతాయని అందుకుగాను ఎఈఓలు మరియు డిసిఏస్ వాలంటీర్స్ సమన్వయంతో పనిచేసి 100% డిజిటల్ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని సూచించారు.
పంటల మార్పిడి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంటూ, ముఖ్యంగా పప్పు ధాన్యాలు , చిరు ధాన్యాలు, నూనె గింజలుసాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు సాయిల్ వాలంటీర్లను గుర్తించి, వారికి మట్టి పరీక్షలు, మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
దీని ద్వారా రైతులు సిఫారసు మేరకు ఎరువులు వాడి పంటల ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు దిగుబడులను పెంచుకో వచ్చని తెలిపారు.రైతులు తమ మొబైల్ నంబర్లను వ్యవసాయ విస్తరణ అధికారుల ఎఈఓల వద్ద తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని, తద్వారా యూరియా యాప్ , ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, వ్యవసాయ సలహాలు నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవచ్చని వివరించారు.
అదే విధంగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ, వెజిటేబుల్ వాలంటీర్స్ కూడా నియమిస్తుందని వారి సేవలు కూడా వ్యవసాయ విస్తరణ అధికారులు , వరి నుండి కూరగాయలు మరియు ఆయిల్ ఫామ్ పంటలకు మార్పిడి చేయుటకు వారిని ఉపయోగించుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రణధీర్ రెడ్డి , కరీంనగర్ అర్బన్, రూరల్ మరియు కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారులు వంశీ కృష్ణ, సత్యం, కోట సంతోష్ కుమార్ ఎఈఓలు పాల్గొన్నారు.






