పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి
శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య
కరీంనగర్, జూలై 14(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో పరిశోధనలు కొనసాగిస్తున్న పీహెచ్‌డీ స్కాలర్స్‌కు, అలాగే లా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే హాస్టల్ సౌకర్యం కల్పించాలని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, పరిశోధక విద్యార్థి చెన్నమల్ల చైతన్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల ప్రాంతాలు మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అనేక మంది పరిశోధక విద్యార్థులు, లా కళాశాల విద్యార్థులు వసతి సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల పరిశోధన కార్యక్రమాలు, గ్రంథాలయ వినియోగం, విద్యా కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. అందువల్ల శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ఈ సమస్యపై దృష్టి సారించి కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ కుమార్, ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపల్ రంగ ప్రసాద్, పిహెచ్డి స్కాలర్స్ దీపిక, రమేష్, మహేష్ ,లా కళాశాల విద్యార్థులు శ్యాంసుందర్ రెడ్డి, సాగర్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.






