అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టగలం
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, ఆగస్టు 5 (ఆదిలాబాద్): అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టగలమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘సైబర్ జాగృతి దివస్’ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది విద్యార్థినులు పాల్గొనగా రిమ్స్ నుంచి చౌరస్తా వరకు సైబర్ జాగృతి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మోసపోయిన వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తే సైబర్ మోసాల్లో డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తతతో వ్యవహరిస్తే సైబర్ మోసాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు.సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయని, జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, నకిలీ ఏపీకే ఫైళ్లు, తెలియని లింకులు, ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలు వంటి మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆశ, అత్యాశలకు లోనై తెలియని లింకులను క్లిక్ చేయడం, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను పంచుకోవడం చేయరాదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలపై అవగాహనతో కూడిన పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, బి.డి. ప్రేమ్ కుమార్, నైలు, ఎస్త్స్రలు దేవేందర్, ప్రణయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






