7 May, 2026 | 3:10 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

జలపాత వందనం

08-12-2025 01:42 AM

పులి పాదముద్రలే తప్ప

మచ్చుకైనా లేని మేక వన్నెలు !

దేశాలవి గాని, దేహాలవి గాని

సార్వభౌమత్వాలు అన్నీ కర్ర బలం కిందే

నలిగిపోతున్నాయి స్వేచ్ఛా స్వాంతనలు లేకుండా !

ఖనిజాలూ కలేజాలూ

కబాబ్ పుల్లలు అవుతున్నాయి !

వాతలతో, మచ్చలతో, అవిటితనం తో

ఆవిరవుతూ, అరిగిపోతూ,

సొమ్మగిల్లిపోతున్నారు !

జలపాత వందనాలు ఆర్పిస్తున్నారు

దుమికి దుమికి

పల్లం వైపు పారి పారి పొలాలకి చేరినట్లు

పాదాభివందనాలతో ప్రణమిల్లుతున్నారు !

వేయి వేయి నామాలు

వల్లించ లేక

పిలిస్తే పలికేవాడా, పలుకులవాడా అని పిలుస్తున్నారు !

అర్ధించి అర్ధించి సుక్కిపోతున్నారు

పలుకులవాడా, దీవెనల వాడా !

ఆటాడుకోనీయవు కానీ

ఆటాడుకుంటావు అని

అలసి అలసి ఆలోచనలే చేయలేకపోతున్నారు !

అరుదుగానైనా

ఆరోగ్య బిరుదులు ఎవరూ పొందడం లేదని

చెమటలు చిందించి

శ్రమ వీర బిరుదులు పొందినవారే

ప్రతీ విపత్తులో ప్రథమ మరణం పొందుతున్నారని

పొగిలి పొగిలిపోతున్నారు పలుకులవాడా దీవెనల వాడా !

శిశిర పత్రాల్లా

అవశేష అవమానాలోచనలు రాల్చుకొని

దివారాత్రులు ఆరాధనా జ్యోతులగా నేత్రాలను వెలిగిస్తున్నా

వేదనా గదుల తాళాలు

కాపలా మనిషి తెరవడం లేదని ఒకటే కంగారవుతున్నారు

పలుకుల వాడా, దీవెనల వాడా !

వాస్తవం

ఏకముఖి కాదని, బహుముఖియని

తెలివిడి తలల నిండా నింపి

అవధుల్లేని ఆవేదనలను అరికడతావని

మౌనంగా చేతులు జోడిస్తున్నారు

జలపాత వందనం గావిస్తున్నారు పలుకులవాడా !