13 March, 2026 | 6:05 AM

యుద్ధం అక్కడ.. పొగ ఇక్కడ!

13-03-2026 12:08 AM
  1. నిలువునా దోచుకుంటున్న గ్యాస్ మాఫియా
  2. సిలిండర్ ధర రూ.7 వేలు 
  3. ఐటీ కారిడార్‌లో కట్టెల కాలం
  4.   90 శాతం రెస్టారెంట్లు బంద్?

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం సెగ భాగ్యనగరంలోని సామాన్యుడి కడుపు కొడుతోంది. ముడిచమురు దిగుమతులు దెబ్బతిని, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోత పడటంతో మహానగరం ఒక్కసారిగా వందల ఏళ్ల వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత డిమాండ్ కంటే 25 శాతం అదనంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

గ్యాస్ బుక్ చేద్దామంటే యాప్‌లో సర్వర్ ఎర్రర్ వస్తోంది. హైటెక్ సిటీలోని గ్లాస్ బిల్డింగుల పక్కన కట్టెల పొయ్యిల పొగ కనిపిస్తోంది. ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కృత్రిమ కొరతను ఆసరాగా చేసుకుని ఒక్కో సిలిండర్‌ను రూ.7 వేలకు అమ్ముతూ సామాన్యులను దోచుకుంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు డొమెస్టిక్ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపుతూ రిస్కుతో కూడిన అక్రమ దందాను సాగిస్తున్నారు.

దీంతో నిజమైన గృహ వినియోగదారులకు బుక్ చేసిన వారానికి కూడా గ్యాస్ అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు, ప్రస్తుత గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం 21 రోజులు వేచి ఉండాలని, డబుల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల వారు 45 రోజులు ఆగాలని నిబంధనలు విధించింది.

ఏడాదికి కేవలం 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే ఇస్తామని ప్రభు త్వం స్పష్టం చేయడంతో సామాన్యుడిపై భారం మరిం త పెరిగింది. బ్లాక్ మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.7 వేల వరకు గ్యాస్ కొరతను కొంతమంది డీలర్లు, డెలివరీ బాయ్స్ కాసుల వర్షంగా మార్చుకుంటున్నా రు. గృహ వినియోగ డొమెస్టిక్ సిలిండర్లను యథేచ్ఛగా హాస్టళ్లు, హోటళ్లకు మళ్లిస్తున్నారు. అమాయక కస్టమర్ల వద్దకు వెళ్లి, వారికి తెలియ కుండానే ఓటీపీలు సేకరించి ఆ సిలిండర్లను బయట బ్లాక్ మార్కెట్‌లో రూ.2 వేల నుంచి ఏకంగా రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. 

హోటళ్లూ కట్టెల బాటకే

కమర్షియల్ గ్యాస్ దొరక్కపోవడంతో నగరంలోని 90 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దిశగా ఉన్నాయి. నగరంలోని ప్రముఖ హోట ల్ షా గౌస్ తన అన్ని బ్రాంచీలలో గ్యాస్ లేక కట్టెల పొయ్యిపైనే వంట లు ప్రారంభించింది. చందానగర్, సికింద్రా బాద్, అమీర్పే ట్ వంటి ప్రాంతాల్లోని హోట ళ్ల ముందు కట్టెల పొయ్యిల పొగలు కనిపిస్తున్నాయి.

ఇలా గే కొనసాగితే వచ్చే 48 గంటల్లో అన్ని హోటళ్లను క్లోజ్ చేయాల్సి వస్తుంది అని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. రంజాన్ నెల కావడంతో ఈ కొరత వ్యాపారులపై మరింత ప్రభావం చూపుతోంది. గ్యాస్ కొరత ప్రభావం నగరంలోని హాస్టళ్ల మెనూపై పిడుగులా పడింది. ఐటీ కారిడార్లోని హాస్టళ్లలో ఉదయం వేళ ఇచ్చే దోశ, పూరీ, వడ, చపాతీ, మైసూర్ బోండాల తయారీని బంద్ చేశారు.  దీంతో రోజువారీ పనులకు వెళ్లే లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు టిఫిన్లు లేక  అలమటిస్తున్నారు.

18 లక్షల మందిపై ఆకలి పంజా

నగరంలో దాదాపు 20 వేల ప్రైవేట్ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, 8 లక్షల మంది విద్యార్థులు, మరో 4 లక్షల మంది వివిధ పనుల కోసం నగరానికి వలస వచ్చిన వారు నివసిస్తున్నారు. మొత్తం 18 లక్షల మంది జీవన ప్రయాణం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పైనే ఆధారపడి ఉంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కేవలం 25 శాతా నికే పరిమితం కావడంతో ఐటీ కారిడార్లో ని హాస్టళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. 

మాకూ ఎమర్జెన్సీ కోటా ఇవ్వండి

హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్ నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, ప్రభుత్వ విద్యాసంస్థల హాస్టళ్లకు ఎమర్జెన్సీ కోటా కింద గ్యాస్ ఇస్తున్నట్లే, లక్షలాది మందికి ఆశ్రయం ఇస్తున్న ప్రైవేట్ హాస్టళ్లను కూడా అత్యవసర విభాగంలో చేర్చాలని డిమాండ్ చేశారు.