సర్‌పై యుద్ధం
౩వ తేదీ దాకా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించాలి
- నేడు ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల్లో సర్‌పై సమీక్ష
- పదవులు, పోస్టుల కోసం ప్రదక్షిణలు వద్దు
- ఆగస్టు 3 దాకా ఎవ్వరూ గాంధీభవన్‌కు రావొద్దు
- సర్‌పై జూమ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): సర్‌పై ఆగస్టు మూడో తేదీ వరకు యుద్ధం చేయాలని, నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించాలని, ఓటర్ జాబితాలో పేర్లను నమోదు చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు అందరూ ఈ 15 రోజులూ సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయి లో తిరగాలన్నారు. సోమవారం ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల్లో సర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు.
ఇన్‌చార్జ్‌లైన ఎంపీలు పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ప్రదక్షిణలు చేయొద్దని, గాంధీభవన్ చుట్టూ ఎవరూ తిరగొద్దని, అలాంటి వారి కి అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు ఎవ్వరు కూడా రావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చుంటున్నారని, గ్రామాల్లోకి వెళ్లి పనిచేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
సర్(ఎస్‌ఐఆర్) పైన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందని, దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్‌పై 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించి సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు.
సోమవారం పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో సర్‌పైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని, ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు. ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పని చేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం సున్నితంగా హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జులుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, చైర్మన్లు బీఎల్‌ఓల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలని నూచించారు. బీఎల్‌ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి.
సర్‌పై నిర్లక్ష్యాన్ని సహించబోం: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్
సర్ ప్రక్రియ చాలా కీలకమైనదని, ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. నాయకులందరూ వారి నియోజకవర్గాల్లో సర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ ప్రక్రియపైనే ఉండాలన్నారు. చిన్న నిర్లక్షాన్ని కూడా సహించేది లేదని, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు సర్ పనులను వేగవంతం చేసి బీఎల్‌ఏలకు సహకారం అందించాలని మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు.
దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలను గుర్తించి ఇక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో మనం ఎంత కష్టపడుతామో అలాగే ఇప్పుడు ఈ పనులను చేయాలన్నారు. సర్ పనులు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో ఉండి.. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలన్నారు.
హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు..
హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని, వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇనాచార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బీఎల్‌ఏ, బీఎల్‌ఓ రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
అంతే కాకుండా సర్‌ను ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందేనని, అన్నింటికీ వారిదే బాధ్యత అన్నారు. ఈనెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సర్‌పై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు.
బాగా పనిచేసే100 మంది బీఎల్‌ఏలకు రాహుల్‌గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.






