20 July, 2026 | 8:40 PM

పౌల్ట్రీ ఫామ్‌లో అల్ఫ్రాజోలం

20-07-2026 02:31 AM
  1. ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు
  2. ప్రధాన సూత్రధారితో సహా నలుగురు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
  3. మొత్తం 35 మంది సిండికేట్‌లో 12 మంది అరెస్ట్
  4. 23 మంది కోసం గాలింపు 
  5. 1.15 కిలోల సరుకు, యంత్రాలు, ముడిసరుకు స్వాధీనం
  6. వీటి విలువ రూ.20.30 లక్షలపైనే..
  7. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్‌లో ఘటన 

భూత్పూర్, జూలై 19: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామ శివారులో ఉన్న ‘లక్ష్మీనరసింహ పౌల్ట్రీ ఫారమ్’లో ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించారు. యంత్రాల ద్వారా అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారి, కోళ్లఫారమ్ యజమానితో సహా నలుగురిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 35 మంది సిండికేట్‌లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో 23 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 1.15 కిలోల అల్ఫ్రాజోలం, తయారీ యం త్రాలు, ముడి రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20.30 లక్షల విల పైనే ఉంటుందని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ తెలిపారు. భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామ శివారులోని లక్ష్మీనరసింహ పౌల్ట్రీ ఫారమ్’ లో గుట్టు చప్పుడు కాకుండా కల్లు తయారీలోకి ఉపయోగించే నిషేధిత అల్ఫ్రాజోలం పెద్దఎత్తున తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్నారు.

ఆదివారం తెల్లవారు జామున తయారు చేసే కేంద్రంపై ఈగల్ ఫోర్స్ టీం టాక్స్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కోళ్లఫారమ్ లోపల ల్యాబ్ ఏర్పాటు చేసి, యం త్రాలను ఉపయోగించి అల్ఫ్రాజోలం తయా రు చేసి, స్థానిక కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ సిండికేట్‌కు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాష్‌గౌడ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఇతను ఇటీవల 30 లక్షలు పెట్టి అల్ఫ్రాజోలం తయారు చేసే కొత్త మిషన్‌ను కొనుగోలు చేశారన్నారు.

ఇతను గతంలో బోయిన్‌పల్లిలో ఇదే తరహా కేసులో(13 సెప్టెంబర్ 2025లో) అరెస్టై జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై (16 మార్చ్ 2026లో)వచ్చి, భూత్పూర్ మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామ శివారులో ఉన్న పౌల్ట్రీఫామ్‌ను లీజుకు తీసుకున్నాడు. మళ్లీ ఈ అక్రమ వ్యాపారాన్ని వారం రోజుల నుంచి ప్రారంభించాడు.

ఈ దాడు ల్లో ప్రధాన సూత్రధారితో సహా మొత్తం నలుగురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఇందులో పౌల్ట్రీ ఫారం యజమాని కూడా ఉన్నాడు. రూ.20.30 లక్షల విలువైన సుమారు 1.15 కిలోల అల్ఫ్రాజోలం, తయా రీ యంత్రాలు, ముడి రసా యనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు, ఈ సిండికేట్‌లో మొత్తం 35 మందిని గుర్తించారు. వీరిలో 12 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన 23 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.