12 August, 2026 | 1:33 AM

నత్తతో కాజీపేట ఆర్‌ఓబీ పోటీ!?

12-08-2026 12:32 AM

తొమ్మిదేళ్లయినా పూర్తి కాని పనులు

హనుమకొండ (మహబూబాబాద్), ఆగస్టు 11 (విజయక్రాంతి): వరంగల్ మహా నగరంలో అత్యంత కీలకమైన వరంగల్ -  హైదరాబాద్ రహదారిపై కాజీపేట వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి తొమ్మిదేళ్లుగా సాగుతూ నత్తతో పోటీ పడుతోంది. విపరీతమైన ట్రాఫిక్ పెరగడంతో ప్రస్తుతం ఉన్న ఆర్వోబీ కి సమాంతరంగా 2017 లో 78 కోట్ల రూపాయల వ్యయంతో మరో ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. భూ సేకరణ, రైల్వే అనుమతుల అనంతరం 2023 వరకు సిమెంట్ కాంక్రీట్ పనులను పూర్తి చేశారు.

బల్లార్షా వరంగల్ రైల్వే మార్గంలో కాజీపేట టౌన్ స్టేషన్ వద్ద రైల్వే లైన్లపై ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ట్రస్ గడ్డర్లు, స్టీల్ స్పాన్, డెక్ ఏర్పాటు పనులు గడచిన మూడేళ్లుగా ‘సాగు’తున్నాయి. గత కొద్ది నెలలుగా పనుల్లో వేగం పెంచాలని, ట్రాఫిక్ సమస్య తీవ్రమై ఉన్న ఒక్క వంతెన వద్ద తరచుగా ఇబ్బందులు కలుగుతున్నాయని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులపై తీవ్ర వత్తిడి  తెస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఆర్వోబీ పై ఏ చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఏర్పడుతోందని, అత్యవసర వైద్యం, ఇతర అవసరాలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గం లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పనుల్లో కొంత వేగం పెంచి వెల్డింగ్ పనులు చేసినప్పటికీ, బ్రిడ్జి నిర్మాణ పనులు ఆశించిన రీతిలో ముం దుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణానికి తెచ్చి పెట్టిన గడ్డర్లు, ఇతర పరికరాలు తుప్పుపట్టి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

అర్ధ శతాబ్దంగా సేవలందిస్తున్న పాత వంతెన

హనుమకొండ నుండి హైదరాబాదు ప్రధాన రహదారిలో కాజీపేట వద్ద 1975లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. 50 ఏళ్లుగా పాతకాలం నాటి వంతెన ఇప్పటికీ సేవలందిస్తోంది. అప్పట్లో అప్పటి రద్దీ కనుగుణంగా రూపొందించిన ఆర్‌ఓబి ఇప్పుడు వందల రెట్లు పెరిగిన ట్రాఫిక్ ను తట్టుకోవడానికి ఇబ్బందిగా మారింది. హనుమకొండ, కాజీపేట పట్టణ వాసులు ఈ వంతెన ద్వారా హైదరాబాద్ కు వెళ్లడానికి అనుకూలంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు పాత వంతెన పై రాకపోకలు సాగిస్తున్నాయి.

రోజు రోజుకు పెరిగిన ట్రాఫిక్ కారణంగా అదనంగా మరో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 1970లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 1975లో ప్రారంభించగా, కొత్తగా నిర్మిస్తున్న ఆర్‌ఓబి తొమ్మిదేళ్లయినా, అందులో అత్యధిక పరికరాలు, సౌకర్యాలను వినియోగిస్తున్నప్పటికీ పూర్తి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రహరీ గోడగా బ్రిడ్జి గడ్డర్లు !

కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూపొందించిన గడ్డర్లు తుప్పు పట్టిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రైల్వే పోర్షన్ బ్రిడ్జి పై భాగాన  గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గుత్తేదారు సిమెంట్ కాంక్రీట్ స్టీల్ గడ్డర్లు తయారు చేయించారు. జాప్యం కారణంగా వాటిని సెంట్ గ్యాబ్రిల్ స్కూల్ వైపు ఉంచడం వల్ల ‘ప్రహరీ గోడ’గా మారిపోయాయి. పాఠశాల ప్రహరీ గోడగా చాలామంది వాటిని భావిస్తూ, ఇదేమిటి ఇంత పెద్ద ప్రహరీ గోడ ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.

ఇంకెంత కాలం

కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తగా వంతెన నిర్మిస్తామంటే ఎంతో సంతోషించాము. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తొమ్మిదేళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారు. ట్రాఫిక్ అధికంగా మారి, ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిపై ఉదయం సాయంత్రం పూట తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.

ఇంకెంత కాలానికి బ్రిడ్జి పూర్తి చేస్తారో తెలియడం లేదు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఇరువైపులా రహదారి నిర్మాణం పూర్తి చేయడంతో ఇటీవల బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని భావించిన ఓ లారీ ప్రమాదపు అంచున నిలిచిపోయింది. ఇప్పటి కైనా అధికారులు స్పందించి మిగిలిపోయిన రైల్వే పోర్షన్ బ్రిడ్జి పనులను పూర్తిచేసి ఇబ్బందులు తొలగించాలి. 

వాహనదారుడు, దర్గా కాజీపేట