స్థానిక హమాలీల హక్కులకు భంగం.. ఫ్యాక్స్ సొసైటీపై ఆగ్రహం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో స్థానిక హమాలీలకు అన్యాయం జరుగుతోందని హమాలీల సంఘం నాయకులు ఆరోపించారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రారంభం నుంచి స్థానిక హమాలీలు తూకం పనులు నిర్వహిస్తూ వస్తుండగా, కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న సమయంలో బయటి ప్రాంతాలకు చెందిన బిహారీ కార్మికులను తీసుకువచ్చి తూకం పనులు అప్పగించడం స్థానిక కార్మికుల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
ఈ సందర్భంగా హమాలీల సంఘం అధ్యక్షుడు లింబయ్య, నాయకులు లోకుర్తి రాజు, పొన్నం హనుమాన్లు, చెక్కపల్లి నరసయ్య, యాస శ్రీను తదితరులు మాట్లాడుతూ గ్రామంలో జరిగే చిన్నా పెద్దా పనులన్నింటిలో స్థానిక హమాలీలే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.అయితే ప్రస్తుతం తమకు రావాల్సిన ఉపాధి అవకాశాలను దూరం చేయడం వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాథమిక సహకార సంఘం చైర్మన్, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్థానిక హమాలీలకు న్యాయం చేయాలని, వారి ఉపాధి హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






