17 June, 2026 | 11:22 PM

రాజీవ్ రహదారిపై ధర్నా చేసిన 11 మందిపై కేసు నమోదు

17-06-2026 09:51 PM

- వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు

- నష్టపరిహారం డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన బంధువులు

గజ్వేల్: వర్గల్ కమాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొమిరి లక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగిన 11 మంది వ్యక్తులపై గౌరారం పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరారం ఎస్సై జె. ఆరోగ్యం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16న వర్గల్ కమాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమిరి లక్ష్మి మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువులు, గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు గౌరారం పరిధిలోని రాజీవ్ రహదారిపై నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కారు డ్రైవర్ నుంచి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ రహదారిపై అడ్డంగా కట్టెలు వేసి బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు సంబంధిత 11 మంది వ్యక్తులపై చట్టపరమైన నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.