రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి
* నేటి నుంచి యూరియా బుకింగ్ యాప్ అమలు
* నమోదు చేసుకున్న రైతులకే యూరియా సరఫరా
వ్యవసాయ అధికారి ప్రీతమ్ కుమార్
గరిడేపల్లి,(విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టిందని వ్యవసాయ అధికారి ప్రీతమ్ కుమార్ తెలిపారు. జూన్ 18న ఉదయం 10 గంటల నుంచి సూర్యాపేట జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని ఆయన వెల్లడించారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. యూరియా పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలని స్పష్టం చేశారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
యూరియా బుక్ చేసుకునే ముందు రైతులు తమ మొబైల్ నంబర్ పట్టాదారు పాస్‌బుక్‌కు అనుసంధానం అయి ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు అలాగే సాగు విస్తీర్ణ వివరాలను ధృవీకరించుకుని,విడుదల వారీగా యాప్‌లో యూరియాను బుక్ చేసుకోవచ్చన్నారు.యూరియా బుకింగ్ అనంతరం రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో సంబంధిత ఎరువుల దుకాణం లేదా సహకార సంఘానికి వెళ్లి యూరియాను పొందవచ్చని తెలిపారు.యాప్ వినియోగంలో లేదా బుకింగ్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు.రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ప్రభుత్వ నూతన విధానానికి సహకరించాలని ప్రీతమ్ కుమార్ కోరారు.






