వాసవి వరల్డ్ విద్యార్థి ప్రతిభ
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌లోని వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థిని గుండా తన్వి శ్రేష్ఠ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో 2026 ఏప్రిల్ 26న నిర్వహించిన అత్యధిక మంది పాల్గొన్న కరాటే ప్రదర్శన (Largest Karate Display) లో పాల్గొని Guinness World Records గుర్తింపును పొందింది. ఈ విశిష్ట విజయానికి గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి అధికారిక Certificate, Official Attempt Medal అందజేయబడింది.
విద్యార్థిని సాధించిన ఈ ఘనత పాఠశాలకే కాకుండా నిర్మల్ జిల్లాకు కూడా గర్వకారణమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా వాసవి వరల్డ్ స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు గుండా తన్వి శ్రేష్ఠను ఘనంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని సాధించిన ఈ ఘనత ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
"కృషి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించడం సాధ్యమే" అనే సందేశాన్ని తన్వి శ్రేష్ఠ విజయం మరోసారి చాటి చెప్పారు. వాసవి వరల్డ్ స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి, విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తోంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైల జాయ్ సన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






