ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి
ఈ నెల 6 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఎస్ రజిత తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిర్దేశిత రోజులలో నాలుగు దశలలో నిర్వహిస్తామని వివరించారు.
మొదటి దశలో మార్చి 6 నుండి మార్చి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, ఆర్బీఎస్కే బృందాలు, ఇతర వైద్య సిబ్బందికి గర్భిణీ స్త్రీలకు, తల్లులకు అందవలసిన పోషకాహారము, వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కల్పించడంతోపాటు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లపై ఆరోగ్య పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల ప్రసూతి స్త్రీ రోగనిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, నేత్ర, కీళ్ల ఎముకల, దంత వైద్య నిపుణులతో పాటు జనరల్ మెడిసిన్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన గర్భాశయ క్యాన్సర్ రాకుండా స్త్రీలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు.
ప్రత్యేక వైద్య నిపుణులతో ఈ తేదీల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ నెల మార్చి 7వ తేదీన హనుమాజిపేట, 9వ తేదీన కోనరావుపేట, 10వ తేదీన లింగన్నపేట, 11వ తేదీన పోతుగల్, 12వ తేదీన విలాసాగర్, 13వ తేదీన ఎల్లారెడ్డిపేట, 14వ తేదీన పెద్దలింగాపూర్, 16 వ తేదీన నేరెళ్ల, 17వ తేదీన తంగళ్ళపల్లి,18వ తేదీన కొదురుపాక, 20వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 23వ తేదీన సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నగర్, 24వ తేదీన చీర్లవంచ, 25వ తేదీన బోయినపల్లి, 26 వ తేదీన కోనరావుపేట, 28 వ తేదీన పోతుగల్, 30వ తేదీన విలాసాగర్, ఈ నెల మార్చి 31 వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య ఆరోగ్య శిబిరాలు, పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తెలిపారు.




