నిమిషాల్లో యూరియా గయాబ్
- బస్తాలు, అయిపోతున్నాయి
అన్నదాతకు తప్పని యూరియా తిప్పలు
అన్నదాతకు హరిగోశ
యాప్ పేరిట వ్యాపారం
యూరియా కోసం రైతుల ఆందోళనలు
ఎల్లారెడ్డి, మార్చి5 (విజయక్రాంతి): తెలంగాణ, రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఎరువుల సరఫరాలో జాప్యం, ప్రైవేట్ వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్, కొత్తగా తెచ్చిన టెక్నాలజీ (యూరియా యాప్) అవగాహన లేకపోవడం వల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
నిత్యం పడిగాపులు
యూరియా బస్తాల కోసం సొసైటీల వద్ద రైతులు గంటల కొద్దీ, కొన్ని చోట్ల రోజుల తరబడి క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు.
ఎరువులకొరత -బ్లాక్ మార్కెటింగ్ : అధికారికంగా యూరియా లభించక, ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నారని, పక్కాగా బస్తా 46 కిలోల ధర 276.12 ఉన్నా, నల్లబజారులో ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
యాప్ కష్టాలు: ప్రభుత్వం తెచ్చిన యూరియా ట్రాకింగ్ యాప్, ఓటీపీ (OTP) విధానంపై అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సరఫరాలో జాప్యం: రవాణా సౌకర్యాలు లేకపోవడం, డిమాండ్కు తగినంత సరుకు రాకపోవడంతో యూరియా నిల్వలు అడుగంటాయి.
పోలీసుల పర్యవేక్షణ: కొన్ని చోట్ల ఉద్రిక్తతలు రావడంతో పోలీసులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. తమ పంటలు దెబ్బతింటున్నాయని, సకాలంలో ఎరువులు అందకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు తమ ఫోన్ లను ఫర్టిలైజర్ యాప్ ఓపెన్ చేసి చూసే లోపే క్షణాల్లోనే ప్రాథమిక సహకార సంఘాలు ఫర్టిలైజర్ దుకాణాలలో నిమిషాల్లోనే వేలవస్తులు విక్రయం జరగడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
రైతులకు శాపముగా..
పంటలు లక్ష లాది ఎకరాల్లో ఉన్నప్పటికీ లక్షల యూరియా బస్తాలు ఇప్పటికే విక్రయం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అసలు యూరియా కొరత రావడం రైతులకు పెద్ద శాపంగా మారింది. రైతులకు అందకుండా యూరియా ఎక్కడికి పోయిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట మద్యస్థ స్థాయికి వచ్చేవరకు యూరియా అవసరము ఉన్నప్పటికీ అవసరం ఉన్న సన్న కారు, చిన్న కారు రైతులకు యూరియా అందకపోవడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రభుత్వం సన్నకారు రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు రైతులు వాపోతున్నారు.
నేటికీ వీడని.. యూరియా కష్టాలు
రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. ప్రభుత్వ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్పు అవగాహన లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్లో బుక్ చేసుకున్నా క్షణాల్లో నో స్టాక్ చూపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక డబ్బులు ఎక్కువైనా కొందరు యూరియా లిక్విడ్ వాడాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు పేర్కొన్నారు.




