5 March, 2026 | 7:24 PM

మొక్కజొన్న పంట డబ్బులు సత్వరమే చెల్లించాలి

05-03-2026 06:06 PM

అఖిల పక్షం నాయకులు..

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మొక్కజొన్న రైతుల పంట డబ్బులు సత్వరమే చెల్లించాలని అఖిల పక్షం నాయకులు మండల కేంద్రంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మొక్క జొన్న పంట డబ్బులు ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస కనబడటం లేదా అని వారు అన్నారు.

ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి పండించిన పంటలు దళారులకు అమ్ముకుంటే మోసపోతాం అని ప్రభుత్వానికి అమ్ముకుంటే మూడు నెలలు గడుస్తున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ స్పందించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డీఎం తో అఖిల పక్షం నాయకులు ఫోన్లో సంప్రదించగా వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీకాంత్, మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు గంగి రమేష్, బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు రెడ్డి రాజులు, నాగ్లూర్ సాయిలు, పోతంగల్ కిషన్ రావ్, గాంధారి విడిసి అధ్యక్షుడు ఆకుల స్వామి, దర్భస్తు రవి, భారతీయ కిసాన్ సంగ్ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..