calender_icon.png 4 February, 2026 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో లొల్లి

04-02-2026 02:07:04 AM

దేశాన్ని అమ్మేశారు!

  1. అమెరికా ఒత్తిళ్లకు లొంగిన ప్రధాని.. ఒక్కరోజులోనే వాణిజ్య ఒప్పందం ఎలా జరిగింది?: రాహుల్
  2. టేబుళ్లపైకి ఎక్కి.. కాగితాలు చించి విసిరిన కాంగ్రెస్ సభ్యులు
  3.   8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౩: ‘అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై నాలుగు నెలలుగా ప్రతిష్టంభన నెలకొంది. నాలుగు నెలలుగా లేని వాణిజ్య ఒప్పందం ఒక్కరోజులోనే ఎలా జరిగింది? ప్రధాని మోదీ అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిణామం జరిగింది. భారత కార్పొరేట్ శక్తి ఆదానీపై అగ్రరాజ్యంలో కేసులు నమోదు కావడం వల్లే ప్రధాని రాజీ పడ్డారు.

తద్వారా యావత్ భారత దేశ రైతుల కష్టాన్ని ఆ దేశానికి అమ్మేశారు’ అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె ‘ఆత్మకథ’ పుస్తకంలోని కొన్ని అంశాలను రెండో రోజూ సభలో ఉటంకించారు.

ఆ పుస్తకంలో నరవణె 2020 భారత్‌లోకి చైనా యుద్ధ ట్యాంకర్ల ప్రవేశించాయని రాశారని, దీనిపై ఓ ప్రముఖ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించిందని పునరుద్ఘాటించారు. దీంతో బీజేపీ ఎంపీ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నరవణే ఆత్మకథ ఒక అముద్రిత రచన అని పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొం ది. ఈ క్రమంలో రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. సభలో ఒక ప్రతిపక్ష నేత గొంతునొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

8 మంది ఎంపీల సస్పెన్షన్

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే చైనా చొరబాటు అంశాన్నిప్రస్తావిస్తూ ఉండటంతో సభలో గందరగోళం నెలకొంది. పలువురు కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. వారిలో కొందరు సభ్యులు టేబుళ్లపైకి ఎక్కి కాగితాలు చించి విసిరేశారు. సభ్యుల ప్రవర్తనపై లోక్‌సభ ప్యానల్ స్పీకర్లలో ఒకరైన కృష్ణప్రసాద్ తెన్నేటి స్పీకర్ స్థానంలో ఉండి తీవ్రంగా స్పందించారు. సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.

అలాగే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఎంపీలు అమరీందర్ సింగ్ రాజావారింగ్, గుర్జీత్‌సింగ్ ఓజా, హిబీఈడెన్, డీన్ కురియకోస్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాణిక్కఠాగూర్, ప్రశాంత్ యాదోరావ్ పడోలే, ఎస్ వెంకటేశన్‌ను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభ్యులు హద్దులు మీరారని, సభా గౌరవానికి భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. 

వాణిజ్య ఒప్పందం వెనుక చీకటి కోణం 

లోక్‌సభ వాయిదా తర్వాత ప్రతిపక్ష నేత పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడా రు. చైనా చొరబాటు అంశంపై మాట్లాడేందుకు సభలో తనకు అవకాశం లభించలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ అగ్రరాజ్య ఒత్తిళ్లకు లొంగి భారత దేశ ప్రయోజనాలను ఫణంగా పె ట్టారని ఆరోపించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక చీకటి కోణం ఉందని అభిప్రాయపడ్డారు.

తన ప్రతిష్ఠ దెబ్బతింటుందనే భయంతోనే అమెరికాతో మోదీ లొంగిపోయారని విమర్శించారు. అలాగే అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టెయిన్ ఫైల్స్’ అంశాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. ఆ ఫైల్స్లో ఉన్న విషయాల వల్ల ప్రధానిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, అందుకే ఆయన భయపడుతున్నారని ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టను నిర్మించిన వారే ఇప్పుడు దానిని కూల్చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. 

ప్రతిపక్ష నేత గొంతునొక్కుతున్నారు!

లోక్‌సభలో తాను ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈమేరకు స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా అడ్డుకోవడం అప్రజస్వామికమని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత అంశం ముఖ్యభాగమని, ఆ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మాజీ ఆర్మీ చీఫ్ నరవణే అముద్రిత ఆత్మకథలో చైనా చొరబాటుపై రాసిన విషయాలపై చర్చ పెట్టకపోవడం సభా ఉల్లంఘనలకు పాల్పడడమేనని అభిప్రాయపడ్డారు. స్పీకర్ నిష్పాక్షికంగా ఉండాలని, ప్రతిపక్షాల హక్కులను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆయనపై ఉందని గుర్తు చేశారు.