19 August, 2026 | 10:47 AM

యాప్ తో రైతులు గోస

19-08-2026 09:36 AM

కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించేందుకు కృషి చేయాలి

చివరి ఆయకట్టు వరకు పంటకి సాగునీరు అందించాలి

భారీ ర్యాలీతో సబ్‌ కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

కల్లూరు,(విజయక్రాంతి) : తెలంగాణ ఆడబిడ్డలకు తోబుట్టువులా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందించిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ వంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని,అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. గతంలో అమలైన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అర్హులైన పేద కుటుంబాలకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ పథకాల అమలులో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

యూరియా కోసం రైతుల అవస్థలు

రైతులకు యూరియా అందించేందుకు అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ యాప్‌ విధానాన్ని వెంటనే తొలగించి,ప్రతి రైతుకు సులభంగా ఎరువులు అందేలా ప్రత్యామ్నాయ విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.యాప్‌లో యూరియా బుక్‌ చేసుకునేందుకు రైతులు తమ వ్యవసాయ పనులను సైతం పక్కనపెట్టి గంటల తరబడి ప్రయత్నిస్తున్నారని, నిరక్షరాశులయిన కొంతమంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎంతసేపు ప్రయత్నించిన బుకింగ్‌ కాకపోవడంతో రైతుల శ్రమ,సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని,రైతులకు సులభంగా ఎరువులు పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగునీరు అందించాలి

ఎన్ ఎస్ పి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను కలిసిన నాయకులు సాగునీటి పరిస్థితిపై వివరించారు.కాలువల చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.చివరి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా నీటి సరఫరాను పర్యవేక్షించాలని,అవసరమైన చోట కాలువల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జెడ్పీటీసీ కట్ట అజయ్‌కుమార్,కౌన్సిలర్లు లక్కినేని రఘు,పెడకంటి రామకృష్ణ,బిఆర్‌ఎస్‌ మండల నాయకులు కొరకొప్పు ప్రసాద్, కాటంనేని వెంకటేశ్వరరావు,జై బాబిరెడ్డి, అంకిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీలు మేకల కృష్ణ,జ జర్పుల లీలావతి,షేక్‌ కమిలి,ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ కుక్క అంజన్ రావు తదితర నాయకులు,రైతులు,మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.