19 August, 2026 | 10:46 AM

పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

19-08-2026 09:32 AM

 గోరంట్ల వసంత్ సిఐటియు  మండల అధ్యక్షులు

బెజ్జర్:(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జర్ మండల ఎంపీడీవో కు వినతి పత్రం అందించారు. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో  పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు గోరంట్ల వసంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 2వ పీఆర్సీలో గుర్తించి కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని కోరారు.

జీవో నెం.51ను సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వయస్సు పైబడిన, అనారోగ్యానికి గురైన లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికులను వెంటనే నమోదు చేయాలని కోరారు.

మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు రూ.30,000 ఆర్థిక సహాయం, పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కర్స్ అజిజ్, అనంతరావు, సలీం, నాగేష్, సుధాకర్,తిరుపతి, వాగయ్య పూర్ణచందర్  తదితరులు పాల్గొన్నారు.