భవ్యకి కేంద్ర క్యాబినేట్ ఆమోదం
రూ.33,600 కోట్ల ఖర్చుతో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు
న్యూఢిల్లీ, మార్చి 18 : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణ యాలు తీసుకుంది. బుధవారం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయనున్నారు.
100నుంచి 1000 ఎకరాల పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. ఎఫ్సీఆర్‌ఏ సవరణ బిల్లుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6,969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి రూ. 1,718 కోట్ల రీయింబర్స్ మెంట్ కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్ లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కేంద్రం భరోసా కల్పించింది.




