ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా
ఎస్‌ఈ ఉత్తమ్ జాడే
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు ఆధునిక ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఒక సబ్‌స్టేషన్ లేదా లైన్‌లో లోపం తలెత్తినా, ప్రకృతి వైపరీత్యాలు, గాలివానలు, వరదలు, అత్యవసర మరమ్మతులు వంటి పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగించే విధంగా ఇంటర్‌లింక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ విధానంలో ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో, అలాగే 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లతో అనుసంధానం చేయడం ద్వారా ఒక మార్గంలో సరఫరా నిలిచిపోయినా వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్ అందించగలుగుతున్నామని చెప్పారు. దీంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. రెండు 33 కేవీ లైన్ల మధ్య ఇంటర్‌లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని, మరో ఐదు ఇంటర్‌లింకింగ్ లైన్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థను దశలవారీగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్‌ఈ స్పష్టం చేశారు.






