HYDRAA Jobs: సరూర్ నగర్ స్టేడియం వద్ద భారీ తోపులాట
హైడ్రాలో ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (Hyderabad Disaster Response and Asset Protection Agency)లో 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి జరిగిన నియామక కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు(Unemployed ) సరూర్‌నగర్ స్టేడియంకు(Saroornagar Stadium) చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కార్యక్రమాలను ఆగస్టు 8, 9 తేదీల్లో నిర్వహిస్తామని HYDRAA ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో, పొరుగు జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే స్టేడియానికి చేరుకున్నారు. నియామక ప్రక్రియ సజావుగా సాగేలా చూడటానికి, జనసందోహాన్ని నియంత్రించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో సరూర్ నగర్ స్టేడియంకు చేరుకోవడంతో భారీ తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
హైడ్రాలో ఉద్యోగాలు ఇవే..
DRF అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులు. సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్. 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్‌పుట్ (7.2 KG) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని హైడ్రా అధికారులు ప్రకటించారు. దీంతో సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు భారీగా నిరుద్యోగులు పోటెత్తారు.






