21 July, 2026 | 8:04 PM

రష్యాపై 400 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి

21-07-2026 12:24 AM

పరస్పర దాడుల్లో 16 మంది మృతి.. మృతుల్లో నలుగురు భారతీయులు

మాస్కో, జూలై 20: రష్యా రాజధాని మాస్కోపై సోమవారం ఉక్రెయిన్ విరుచుకుపడింది. 400కు పైగా డ్రోన్లను ప్రయోగిం చింది. ఉక్రెయిన్ మరో రష్యన్ చమురు డిపోపై దాడి చేసింది. దీంతో యుజ్నీ వ్రాతా పారిశ్రామిక పార్కులో, పోడోల్స్‌లోని ఒక చమురు డిపోలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. రష్యా షాడో ఫ్లీట్‌కు చెందిన రెండు నౌకలపై, నల్ల సముద్రంలో నాలుగు డ్రై కార్గో నౌకలపై కీవ్ దళాలు దాడి చేశా యి. ఈ దాడులతో పలు నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

ప్రతీకార దాడుల పరంపరలో భాగంగా, రష్యా, కీవ్ ఇతర ఉక్రెయిన్ నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో బాంబుల వర్షం కురిపించింది. కొన్ని గంటల తర్వాత ఉక్రెయిన్ ఈ మెరుపుదాడి చేసింది. అలాగే ఒడెసా సమీపంలో సరుకు రవాణా నౌకపై రష్యా దాడి చేసింది. దీంతో ఐదుగురు నావికులతో సహా 10 మంది మృతి చెందారు. రష్యాలోని షెబెకినోలో ఒక ప్రయాణికుల బస్సుపై ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో నలుగురు మహిళలు, ఒక బాలుడితో సహా ఐదుగురు మరణించారు. 23 మంది గాయపడ్డారు.

మాస్కోలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రష్యా రాజధాని వైపు 400కు పైగా ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించిందని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. లాజిస్టిక్స్ సౌకర్యాలు, ఒక చమురు డిపోపై, రష్యా షాడో ఫ్లీట్‌కు చెందిన రెండు నౌకలపై, నల్ల సముద్రంలో నాలుగు డ్రై కార్గో నౌకలపై కీవ్ దళాలు దాడి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

ఒడెసా ఓడ రేవు సమీపంలో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ లియో సరుకు రవాణా నౌకపై రష్యా బాంబు దాడుల్లో ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ నౌకలో ఐదుగురు భారతీయులతో సహా 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడిని భారత ప్రభుత్వం ఖండించింది.