28 February, 2026 | 11:24 PM

శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించాలి

28-02-2026 07:15 PM

- భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి.

- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): శ్రీశైల దేవస్థానంలో మార్చి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారని తెలిపారు. గతేడాది సుమారు 7 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని, ఈసారి కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. మార్చి 2 నుంచి పాదయాత్రగా భక్తులకు అనుమతి ఉంటుంధన్నారు. రోజుకు 4 నుంచి 5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలన్నారు.

మార్చి 8 నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రొటేషన్ పద్ధతిలో వైద్యులను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేక రెడ్ కలర్ డస్ట్‌బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలని సూచించారు. ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను నిర్దిష్ట ప్రదేశాల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈఓకు ఆదేశించారు. గాలివానలు వచ్చినా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు దృఢంగా ఉండేలా ఆర్ అండ్ బి శాఖ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. 

పార్కింగ్ – ట్రాఫిక్ నిర్వహణ

పార్కింగ్ ప్రదేశాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వాహనాలు మొరాయించినపుడు తరలించేందుకు క్రేన్లు, టోయింగ్ వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖకు సూచించారు. తెలుగు, కన్నడ భక్తుల కోసం మే ఐ హెల్ప్ యూ డెస్క్‌లను పెంచాలని, ముఖ్యంగా కన్నడ భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. దర్శన ఏర్పాట్లు రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఒక్కో స్లాట్ రెండు గంటల పాటు ఉండగా, మొత్తం ఎనిమిది గంటలు స్లాట్ దర్శనం నిర్వహిస్తారని మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుందన్నారు. స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూ లైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ దర్శన సమయాల వివరాలు డిస్ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

మార్చి 16 నుంచి 19 వరకు టోల్ మినహాయింపు, పాతాళగంగా బోటు సేవలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి వాలంటీర్లను సమీకరించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు అటవీ శాఖ డిడి విఘ్నేష్ అపూర్వ మాట్లాడుతూ... అటవీ ప్రాంతాల గుండా వచ్చే పాదయాత్ర మార్గాల్లో ఫైర్ వాచర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు దేవస్థాన ఈఓ శ్రీనివాసులు ఉగాది ఉత్సవాల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.