ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం
అమరావతి: ఒంగోలులో శుక్రవారం రాత్రి స్వల్పభూకంపం(Earthquake Hits Ongole) సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల ప్రభావం ముఖ్యంగా గద్దులగుంట, వడ్డీపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, సీతారాంపురం, రిమ్స్ సెంటర్, మంగమూరు రోడ్డు, దేవచెరువు, నెల్లూరు బస్టాండ్, మంగోపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిందని స్థానికులు తెలిపారు.
భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపు తమ ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో చాలామంది ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు సమాచారం లేదు. స్థానికులు ఈ భూకంపం గురించి అధికారులకు తెలియజేశారు. ఈ ప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఒంగోలులో వరస భూకంపాలు వస్తున్నాయి. గతంలో అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి 5.30 గంటల లోపు 2 సార్లు ఇలానే భూ ప్రకంపనలు వచ్చాయి.






