కరీంనగర్ బంద్ ప్రశాంతం
ఎమ్మెల్యే గంగులతో పాటు నేతల అరెస్ట్
కరీంనగర్, మే09(విజయక్రాంతి): ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన కరీంనగర్ బంద్(Karimnagar Bandh ) కొనసాగుతోంది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క అరెస్టు చేసి పిటీసీకి తరలించారు.
శనివారం ఉదయం నుంచే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాకి కార్పొరేటర్ తదితరులను అరెస్టు చేశారు. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న బంద్‌లో పాల్గొనేందుకు గంగాధర మండలం బూరుగుపల్లి నుంచి బయల్దేరిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని బూరుగుపల్లిలోని నివాసానికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. ఇక కరీంనగర్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అరెస్ట్ లను నిరసిస్తూ ప్రభుత్వ, కేంద్రమంత్రి బండి సంజయ్ ల దిష్టిబొమ్మ ను దహనం చేశారు.
ఇక్కడ బంద్ అక్కడ అరెస్ట్
బీఆర్ ఎస్ ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుతో ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీసులు బీఆర్ ఎస్ శ్రేణులను శనివారం ఉదయం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, రాజాపల్లి సర్పంచ్ కటుకూరి మల్లా రెడ్డి,కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, ప్రతాప కృష్ణలను ఉదయం 6 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ మండలంలోని బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, కౌన్సిలర్ల ను ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు తెల్లవారు జామున నుండే వారి ఇంటికి వెళ్లారు. కాగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతో కొందరు నాయకులు అప్పటికే ఇండ్ల నుంచి బయటకు వెళ్లి పోయారు. బీఆర్ ఎస్ శ్రేణులలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.






