6 March, 2026 | 1:17 PM

Su-30MKI Fighter Aircraft Crash: కుప్పకూలిన ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి

06-03-2026 11:25 AM

న్యూఢిల్లీ: అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో(Karbi Anglong) జరిగిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్(Sukhoi Su-30MKI Fighter Jet Crashes ) కూలిపోయిన ఘటనలో భారత వైమానిక దళానికి (Indian Air Force) చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. రష్యాకు చెందిన విమానం అదృశ్యమైన ఒక రోజు తర్వాత, స్క్వాడ్రన్ లీడర్ అనుజ్(Squadron Leader Anuj), ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ మరణించినట్లు ఐఏఎఫ్ శుక్రవారం ధృవీకరించింది. 

గురువారం జోర్హాట్ ఎయిర్‌బేస్(Jorhat Airbase) నుంచి శిక్షణా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. గురువారం రాత్రి 7:42 గంటలకు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారులు వెల్లడించారు. జోర్హాట్(Jorhat) వైమానిక స్థావరం నుంచి దాదాపు 60 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు, గురువారం రాడార్ నుండి అదృశ్యమైన సుఖోయ్-30 ఎంకేఐ(Sukhoi Su-30MKI) కూలిపోయిందని ఐఏఎఫ్(IAF) ధృవీకరించింది. పైలట్లు మృతి పట్ల ఐఏఎఫ్ సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబానికి అండగా నిలుస్తామని ఐఏఎఫ్ ప్రకటించింది. సుఖోయ్-30 ఎంకేఐ అనేది రష్యన్ విమానాల తయారీ సంస్థ సుఖోయ్ అభివృద్ధి చేసిన రెండు సీట్ల మల్టీరోల్ లాంగ్-రేంజ్ ఫైటర్ జెట్(Long-range fighter jet). దీనిని ఇప్పుడు ఐఏఎఫ్ కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) లైసెన్స్‌తో నిర్మించింది. ఐఏఎఫ్ 260 కి పైగా Su-30MKI జెట్‌ల సముదాయాన్ని నిర్వహిస్తోంది. 2024 జూన్‌లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. 2023 జనవరిలో గ్వాలియర్ వైమానిక స్థావరం(Gwalior Air Base) నుండి బయలుదేరిన తర్వాత మరో సుఖోయ్-30 జెట్ కూలిపోయింది.