ఇద్దరి పర్వతారోహకుల మృతి
- ఎవరెస్ట్ ఎక్కి, కిందికి దిగొస్తుండగా దుర్మరణం
- మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు
ఖాట్మాండు, మే 22: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, కిందికి దిగి వస్తున్న ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతిచెందారు. వారు కిందకు దిగుతున్న సమ యంలో తీవ్రంగా అలసిపోయారని, రక్షించేందుకు గైడ్స్ విశ్వప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఎవరెస్ట్ పర్వతంపై తీవ్ర విషాదం నెలకొంది. మృతులు అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించామని నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రుషి బండారీ శుక్రవారం తెలిపారు.
బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది పర్వతారోహకులలో అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేతోపాటు తులసీరెడ్డి పాల్పునూరి, అజయ్‌పాల్ సింగ్ అనే మరో ఇద్దరు భారతీయులున్నట్లు బండారీ తెలిపారు. ఒకేరోజులో అత్యధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన బృందంగా వీరు ఒక రికార్డును నెలకొల్పారని చెప్పారు. అయితే పర్వతం దిగుతున్న సమయంలో సందీప్ ఆరే మృతి చెందారు.
గురువారం సాయంత్రం మరో బృందం పర్వత శిఖరాన్ని చేరుకొని తిరిగి వస్తుండగా అరుణ్ కుమార్ తివారీ కూడా మృతి చెందినట్లు ప్రకటించారు. కాగా ఈ యాత్రను నిర్వహించిన పయనీర్ అడ్వెంచర్స్ డైరెక్టర్ నివేష్ కర్కీ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం షెర్పా పర్వతారోహకుల సహాయంతో కిందకు దిగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై హిల్లరీ స్టెప్ సమీపంలో మరణించారని తెలిపారు. పర్వతారోహకుల మృతదేహాలు కాట్మాండుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీంతో ఈ సీజన్‌లో ఎవరెస్టుపై మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో ముగ్గురు నేపాలీ పర్వతారోహకులు ఉన్నారు.






