రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
చిట్యాల,(విజయక్రాంతి): జాతీయ రహదారి 65 పై నార్కట్ పల్లి లోని నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్(Nalgonda X Road Flyover) వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు ఎన్ ఎల్ 02 3119 మరియు గుజరాత్ రాష్ట్రం కచ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ జిజె 16ఎ డబ్ల్యూ 5757 ఒకదానిని ఒకటి ఓవర్ టెక్ చేసే క్రమంలో స్వల్పంగా ఢీకొనగా, దీంతో 2 వాహనాల డ్రైవర్లు ఫ్లైఓవర్ పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ నుండి కాకినాడ వైపు వెళ్తున్న మరో మోజో ట్రావెల్స్ బస్ ఎన్ ఎల్ 02 3126 అక్కడికి చేరుకుంది. ఆ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్ మరియు బంగారయ్య కూడా అక్కడికి వచ్చి వారితో మాట్లాడుతుండగా, ఇంతలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వస్తున్న లారీ ఎపి 31టిఎచ్ 1289 అతివేగంతో వచ్చి ముందు నిల్చున్న జి జె 16 ఎ డబ్ల్యూ 5757 లారీని బలంగా ఢీకొట్టగా, దీంతో వాహనాల మధ్య ఉన్న నలుగురు వ్యక్తులు వాహనాల మధ్య ఇరుక్కుపోయారు.
ఈ ప్రమాదంలో రెండవ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు అక్కడికక్కడే మృతిచెందగా, మొదటి బస్సు క్లీనర్ సురేష్ కు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్ పల్లి సిఐ కె.నాగరాజు, నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి, చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని తక్షణ చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, రెండు మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు. మూడు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని నార్కట్ పల్లి సీఐ తెలిపారు.




