23-02-2026 01:32:48 PM
జడ్చర్ల : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు చెరువులో పడి గల్లంతు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నవీన్(30), యాదగిరి (26) అనే ఇద్దరు స్నేహితులు ఆదివారం సాయంత్రం వేళ ఈత కొట్టడానికి గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చెరువులో దూకారు. నీటిలో దూకిన ఇద్దరు స్నేహితులు సాయంత్రం వరకు కూడా రాకపోవడంతో వారిని గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే చీకటి పడడంతో సోమవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కాగా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే స్నేహితులిద్దరూ ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో ఈత కొట్టడానికి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనంతో పాటు బట్టలను కూడా అక్కడే వదిలి చెరువులో దూకడంతోనే గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇద్దరు స్నేహితులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పెయింటర్ లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో నవీన్ కు భార్య లక్ష్మి తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.