24 August, 2026 | 9:59 AM

రేపటి నుంచి 'వైరా'లో టీడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర

24-08-2026 08:50 AM

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల యాత్రకు విశేష స్పందన

27, 29 తేదీల్లో సత్తుపల్లి, మధిరలో పాదయాత్ర

షెడ్యూల్ విడుదల చేసిన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి

ఖమ్మం, ఆగస్టు 24(విజయక్రాంతి):  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) - హెచ్ 2843 ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం చేపట్టిన పాదయాత్ర కు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మరథం పట్టినందుకు టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడి జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.  నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ఈనెల 25న వైరా, 27న సత్తుపల్లి, 29న మధిర నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఖమ్మంలోని ఇందిరానగర్ లో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ, పాదయాత్ర సభ్యుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర అటు ప్రభుత్వాలకు కానీ, ఇటు ఏ రాజకీయ పార్టీలకు కానీ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. ఇది కేవలం ప్రభుత్వాలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో అమర జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఆ స్ఫూర్తితో మిగతా నియోజకవర్గాల్లోనూ పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి పాదయాత్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల షెడ్యూల్

ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో యాత్ర ముగిసిన నేపథ్యంలో తదుపరి కొనసాగే వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల పాదయాత్ర షెడ్యూల్ ను జిల్లా కమిటీ విడుదల చేసింది. 25వ తేదీ వైరా నియోకార్గంలోని కారేపల్లి మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి నేరుగా కామేపల్లి, ఏన్కూరు, వైరా మండల కేంద్రాల మీదుగా కొనసాగి కొనిజర్లలో ఆరోజు పాదయాత్ర ముగుస్తుందన్నారు.  27న సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడలో పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆరోజు ఉదయం 9 గంటలకు తల్లాడ మండల కేంద్రంలో ప్రారంభమయ్యే పాదయాత్ర కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మీదుగా వేంసూరు మండల కేంద్రంలో ముగుస్తుందన్నారు.  29న మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా మధిర, బోనకల్, చింతకాని, మండల కేంద్రాల మీదుగా యాత్ర సాగి ముదిగొండ లో ముగుస్తుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, సహాయ కార్యదర్శి జక్కంపూడి కృష్ణ, టీబీజేఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవి కిరణ్, స్టేట్ ఈసీ మెంబర్ టిఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.