13-02-2026 12:40:00 AM
కల్వకుర్తి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : తమకి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు గర్భస్రావం చేయించేందుకు జరిగిన ప్రయత్నాలపై మానవ హక్కుల కమిష న్ తీవ్రంగా స్పందించింది. గర్భిణి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ బలవంతంగా గర్భస్రావం చేయాలనడం చట్టపరంగా తీవ్రమైన నేరమని హెచ్‌ఆర్సీ స్పష్టం చేసింది. డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ గురువారం కేసును విచారించింది.
ఫిర్యాదుదారు భర్త మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి ౩౦న యాదగిరిగుట్ట ఆలయంలో భాగ్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, బావ కలిసి కల్వకుర్తి సమీపంలోని ఆస్పత్రిలో నాలుగు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. దీంతో బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు మహేష్ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చే యకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపణలు ఉన్నాయి.
అన్ని అంశాలను పరిగణించిన కమిషన్ కల్వకుర్తి డీఎస్పీ, వంగూరు పో లీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విచారించి, ఈ నెల 26వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది . బాధితురాలికి రక్షణ కల్పిస్తూ, చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.