గంజాయి.. మారకద్రవాలకు దూరంగా ఉండాలి
క్లోరినేషన్ సమస్యతో బాధపడుతున్న గ్రామానికి ఆర్ వో వాటర్ ప్లాంట్...
పరస్వాడ(కె) గ్రామానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం...
గ్రామంలో తాగునీటికి శాశ్వత పరిష్కారం..
విద్య, ఆరోగ్యం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి..
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్..
ఉట్నూర్,(విజయక్రాంతి): గాదిగూడ మండలం పరస్వాడ(కె) గ్రామంలో తాగునీటి సమస్యను గుర్తించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక చొరవతో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి ఈరోజు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మొదటగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆదివాసీ సంప్రదాయాల నడుమ డప్పు వాయిద్యాలతో జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. గతంలో తీవ్రమైన క్లోరినేషన్ సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు జిల్లా పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్తుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆరో ప్లాంట్ ను గ్రామ పెద్దల తో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి మహిళలు నీటిని తీసుకొని మొదటగా గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆర్వో ప్లాంట్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలని, ప్రతి కుటుంబం శుద్ధి చేసిన తాగునీటినే వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
అదేవిధంగా గ్రామ ప్రజలు, యువత గంజాయి, గుడుంబా, ఇతర మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. గంజాయి సాగు చేసిన వారి పేర్లను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపివేయాలని సిఫార్సు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. యువత చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణించి కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించాలని కోరారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. మూఢనమ్మకాలు, బాబాలు, ఫకీర్ల మాయమాటలను నమ్మకుండా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనవసరంగా టాబ్లెట్లను మందులను వాడటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున వాటి వాడకాన్ని నియంత్రించాలని సూచించారు.






