30 June, 2026 | 3:26 PM

మంథని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం

30-06-2026 03:10 PM

వర్షాకాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో రోడ్లపై నిలిచే వర్షపు నీరు యూజీడీ చాంబర్లలోకి వెళ్లేందుకు అవసరమైన చోట హోల్స్ ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న యూజీడీ చాంబర్లకు మరమ్మతులు చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

అలాగే మున్సిపల్ పరిధిలోని వాటర్ ట్యాంకుల నిచ్చెనలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని మరమ్మతు చేయడం, తాత్కాలిక కూరగాయల మార్కెట్ సమీపంలోని కల్వర్టు కూలిపోవడంతో దానిని పునర్నిర్మించడం, 9వ వార్డులో ఒకటి, 13వ వార్డులో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇతర అనువైన ప్రదేశాలకు తరలించడం, వివిధ వార్డుల్లో ఉన్న 13 విద్యుత్ స్తంభాలను అవసరమైన చోటుకు మార్చే అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.