17 May, 2026 | 1:34 AM

గ్లోబల్ స్టార్ పేరుకు తగ్గట్టే.. చరణ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది!

17-05-2026 12:45 AM

‘పెద్ది’ ఫైట్ మాస్టర్ నబాకాంత్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

మాది మణిపూర్. చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేశాం. నేను ఇక్కడే పెరిగా. నాన్న ఇన్‌స్పిరేషన్‌తో నేను ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి ఉన్నా. స్టంట్స్‌లో 18 ఏళ్ల అనుభవం ఉంది. 

విజయ్ మాస్టర్ దగ్గర, రామ్-లక్ష్మణ్ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశా. ‘పుష్ప’తో యాక్షన్ కొరియోగ్రాఫర్‌నయ్యా. ఆ తర్వాత పుష్ప 2, మనశంకర వరప్రసాద్, డకాయిట్ చేశా. ఇప్పుడు ‘పెద్ది’. 

‘పుష్ప 2’ జరుగుతున్నప్పుడే బుచ్చిబాబు నాతో ‘పెద్ది’ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పారు. అది యాక్షన్ సీక్వెన్స్ కాదు కానీ యాక్షన్‌లా ఉండాలన్నారు. నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. అలా ఆ సీక్వెన్స్ కోసం గ్లింప్స్‌లో చూపించిన బ్యాటింగ్ స్టైల్ షాట్ కంపోజ్ చేశా. అది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయింది. ఆ క్రెడిట్ మొత్తం బుచ్చిబాబు నాకే ఇచ్చారు. ఆయనది చాలా మంచి మనసు. 

ఇందులో ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. చరణ్ ప్రేక్షకులను ‘పెద్ది’ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు. ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. సినిమాలో యాక్షన్ మరో లెవెల్‌లో ఉంటుంది.  

బుచ్చిబాబు ఇచ్చిన యాక్షన్ సీక్వెన్సులన్నీ చాలెంజ్‌గా తీసుకుని చేసినవే. ఇంట్రో దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఎపిసోడ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

నేను హఫీజ్‌పేట్‌లో పెరిగా. అది ఫుల్ మాస్ ఏరియా. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎలాగైనా సిక్స్ కొట్టాలనే తాపత్రయం వుంటుంది. ఆ తాపత్రయంతో బ్యాట్‌ను కింద నుంచి గట్టిగా కొట్టేవాళ్లం. అలాంటి మాస్ స్టైల్ నుంచే ఆ షాట్ పుట్టింది. 

ఇందులో మా గురువులు రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పోలీస్ స్టేషన్‌లో ఒక ఎపిసోడ్ చేశారు. కుస్తీ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నాన్న శ్యామ్ కౌశల్‌ను సంప్రదించాం. ఇందులో నేషనల్ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలు ఉంటాయి. ఆ సీక్వెన్స్‌ను చాలా నేచురల్‌గా చేశారు. ఒక కుస్తీ ఎపిసోడ్ ఫుల్ మాస్.. ఇప్పటివరకు అలాంటి మాస్ ఎవరూ చూసుండరు. మరో కుస్తీ ఎపిసోడ్ కూడా ఉంది. అది చాలా చాలెంజింగ్‌గా అనిపించింది.

రామ్‌చరణ్‌లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే, మనం ఏం చెబుతున్నామో అది చాలా శ్రద్ధగా వింటారు. టెక్నీషియన్లను చాలా బాగా నమ్ముతారు. ఈ సినిమా కోసం చరణ్ ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన బాడీ మీద యాక్షన్ సీక్వెన్సులుంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, డైట్‌లో ఉంటూ ఆయన యాక్షన్ కోసం పడిన కష్టం మామూలుది కాదు.   

నేను యాక్షన్ పరంగా చాలా క్లియర్‌గా ఉంటా. ఒక క్యారెక్టర్ ఎంత యాక్షన్ మోయగలదో అంతవరకే చేయాలి. అప్పుడే నమ్మశక్యంగా ఉంటుంది. చరణ్ ‘మగధీర’ లాంటి ఎన్నో అద్భుతమైన యాక్షన్ సినిమాలు చేసి వచ్చారు. ఆయన యాక్షన్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు.

చరణ్‌కు గాయమైన క్షణంలో నేను ఏడ్చేశా. ఒక రోల్ మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు పొరపాటున అలా జరిగింది. ఆ పొరపాటు తనదేనని ఆయన ఓపెన్‌గా చెప్పారు. నిజంగా ఏ హీరో కూడా అలా ఒప్పుకోరు. తనకంటే ముందు ఎదురుగా ఉన్న ఫైటర్‌కు ఏమైందో చూడమని అందరికీ చెప్పారు. ఆయన కుట్లు వేసుకుని మరుసటి రోజుకే షూటింగ్‌కు వచ్చేస్తే, నేను షాక్ అయిపోయా. ఒకసారి అనుకుంటే అది పూర్తవ్వాలి.. అదే ఆయన కమిట్‌మెంట్, డెడికేషన్. 

ఇందులో దివ్యేందు, శివరాజ్‌కుమార్‌తో కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయి. శివరాజ్ ఎనర్జీ లెవెల్స్ సూపర్. ఆయన చాలా స్ట్రాంగ్ విల్‌పవర్‌తో ఉంటారు. 

‘పెద్ది’లో ఎమోషన్ మామూలుగా ఉండదు. ఆ ఎమోషన్స్‌కు ఫస్ట్ హాఫ్ నుంచే ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. గ్లోబల్ స్టార్ పేరుకు తగ్గట్టుగానే చరణ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ‘పెద్ది’ జర్నీ అందరికీ ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. 

చరణ్.. చిరంజీవికి యాక్షన్ సీక్వెన్సులు చూపించారు. నా గురించి చాలా మంచి విషయాలు చెప్పడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఇంకా నేను -‘ప్యారడైజ్’, ‘రౌడీ జనార్ధన’, వంశీ పైడిపల్లి సినిమా, చిరంజీవి సినిమాలు చేస్తున్నా.