17 May, 2026 | 3:06 AM

‘పెద్ది’ డైలాగ్.. చిరు లీక్!

17-05-2026 12:40 AM

రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ‘పెద్ది’ ట్రైలర్ ఉంటుందం’టూ అంచనాలు పెంచేశారు చిరు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ ఈ నెల 18న విడుదల చేయనున్నారు. అయితే, ఇప్పటికే ఈ ట్రైలర్‌ను వీక్షించిన చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అంతేకాదు, ఒక డైలాగ్‌ను కూడా లీక్ చేశారు. “పెద్ది ట్రైలర్ చూశా. వావ్..! 3 నిమిషాలు.. ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్.. ఒక్కొక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్.. ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్స్ లెవల్లో ఉన్నాయి.

అన్నట్టూ చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి.. ‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారూ..’ సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పా..” అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు చిరంజీవి. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్న ‘పెద్ది’ టీమ్‌లో తాజా ‘చిరు లీక్స్’ మరింత ఉత్సాహాన్ని నింపినట్టయ్యింది. కొడుకు సినిమా కోసం తండ్రి ఎంచుకున్న ప్రచార శైలిని చూసి ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు మెగా అభిమానులు.