సేవా చేయడంలోనే నిజమైన సంతృప్తి
- వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పక్కాగా చేయండి
-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్ 7 : సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డ్ లో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ఉండేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాలకు రోజూ భారీ సంఖ్యలో వచ్చే వ్యాపారులు, కూలీలు, వినియోగదారులు తీవ్రమైన ఎండల కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కార్పొరేటర్ అనురాధ చిన్నని ప్రశంసించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తేదారుతో నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, వర్షాకాలంలో వర్షపు నీరు మార్కెట్ లోపలికి చేరకుండా సమగ్ర డ్రైనేజ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతను కాపాడుతూ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని గుత్తేదారుకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈసందర్భంగా వీధి వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పండ్ల వ్యాపారులను ప్రోత్సహిస్తూ స్వయంగా పండ్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, స్థానిక నాయకులు వర్థ రవి, రఘు దాసరి, గోపి నాయక్, మార్కెట్ వ్యాపారులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




