7 April, 2026 | 5:19 PM

సనత్‌నగర్‌లో నీటి సమస్యపై తలసాని ఆగ్రహం

07-04-2026 03:34 PM

– పరిష్కారం లేకపోతే ఆందోళన హెచ్చరిక

సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అమీర్ పేట డివిజన్ లోని బిజేఆర్ నగర్, బి జె జె ఆర్ నగర్, బల్కంపేట, ఎస్సార్ నగర్ లలో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఆయా ప్రాంతాల ప్రజలు ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విన్నవించారు. దీంతో మంగళవారం ఆయన అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో ఏ ఒక్క రోజు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు. కానీ గత 10 రోజుల నుండి త్రాగునీరు సరఫరా కావడం లేదని, నీటికోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన ను వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో ఒక వేళ నీటి సరఫరా చేసినా నల్లాలు లో ప్రెషర్ తో వస్తున్నాయని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే తనతో ఉన్న వాటర్ వర్క్స్ CGM ప్రభు ను సమస్య గురించి ప్రశ్నించగా, బుధవారం నుండి సక్రమంగా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి తానే ప్రత్యక్ష ఆందోళన చేపడతానని హెచ్చరించారు. అదేవిధంగా బోర్ వెల్స్ పని చేయడం లేదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి అవసరమైన మరమ్మతులు చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. బల్కంపేట లో పర్యటించిన సమయంలో స్థానిక కమిటీ హాల్ కు విద్యుత్ సరఫరా లేదని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే ను కోరారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకునేవారు లేకుండాపోయారని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నదని, ప్రత్యేకంగా మున్సిపల్ శాఖకు మంత్రి ఉంటే సమస్యలపై సమీక్షలు చేసేవారని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్య ఏర్పడవద్దనే ముందు ఆలోచనతోనే రిజర్వాయర్ ను నిర్మించినట్లు వివరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతలను మరిచి ప్రజా సమస్యలను గాలికొదిలిందని విమర్శించారు. సరైన కార్యాచరణ లేకుండా GHMC ని మూడు కార్పొరేషన్ లుగా విభజించడంతో అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారని అన్నారు.