కర్రెగుట్టల అభివృద్ధి వేగవంతంగా అడుగులు
అడ్డంకులన్నీ తొలగిపోయాయి
డీజీపి శివధర్ రెడ్డి, అటవీ శాఖ చీఫ్ డాక్టర్ సువర్ణ
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇంతకాలం అభివృద్ధికి దూరంగా నిలిచిన ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ముందుకు సాగుతామని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అటవీ శాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ ప్రకటించారు. మంగళవారం కర్రెగుటల్లో రోడ్డు పనులను వారి ఇరువురు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖలతోపాటు ఇతర శాఖల సమన్వయంతో ఇంతకాలం అభివృద్ధికి దూరంగా నిలిచిన కర్రెగుట్టల ప్రాంతాన్ని వెంకటాపూర్, ములుగు పట్టణాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇంతకాలం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు పూర్తిగా తొలగిపోయాయని, కర్రెగుట్టల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేవని, చట్ట పరిధిలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కర్రెగుటల ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే విధంగా రోడ్లు, మౌలిక వసతులు, రక్షణ కల్పిస్తామని చెప్పారు.




