11 July, 2026 | 9:25 PM

గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్

11-07-2026 08:29 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన యాదవ సంగం మాజీ అధ్యక్షుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపాల్ మృతి బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందించినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్ల మధు, మీసాల కృష్ణ తెలిపారు.

గోపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కేటీఆర్ ఆకాంక్షించినట్లు వారు వెల్లడించారు. అలాగే, గోపాల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్ల మధు, మీసాల కృష్ణ, బండి దేవేందర్ యాదవ్, బొడ్డు శ్రీధర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరఫున కూడా గోపాల్ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.