11 July, 2026 | 9:11 PM

దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్

11-07-2026 08:21 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దేవమ్మ వినతిని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆప్యాయంగా పలకరించి మూడు చక్రాల మోటారు వాహనం మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం నాయినిపల్లి మైసమ్మ దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి సందర్శించిన కలెక్టర్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దేవమ్మ తనకు ప్రయాణానికి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించగా, ఆమె వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో దేవమ్మకు దివ్యాంగుల పింఛన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా అనే విషయాన్ని కలెక్టర్, ఎస్పీ ఆరా తీశారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వెంటనే పరిష్కరించడం ప్రజాపాలనలో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.