వికలాంగ విద్యార్థికి ట్రైసైకిల్ అందజేత
సదాశివపేట, ఆగస్టు 20 : సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ బడిబాట కార్యక్రమంలో విద్యార్థి మహేష్‌కు జిల్లా అధికారుల చొరవతో ట్రైసైకిల్ అందజేశారు. నిజాంపూర్ కాలనీకి చెందిన కుర్థం శంకర్ రాములమ్మ దంపతుల కుమారుడు మహేష్ కండరాలు, ఎముకల వైకల్యంతో బాధపడుతున్నాడు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందడంతో తల్లి రాములమ్మ పేదరికంలోనే కుమారుడిని చూసుకుంటోంది.
బడిబాటలో భాగంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు మహేష్ పరిస్థితిని గుర్తించి మండల విద్యాధికారి శంకర్, భవిత సెంటర్ ప్రత్యేక విద్యా ఉపాధ్యాయురాలు నవీన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారుల సహకారంతో గురువారం మహేష్‌కు ట్రైసైకిల్ అందజేశారు. ట్రైసైకిల్ అందడంతో మహేష్, తల్లి రాములమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి శంకర్, ఉపాధ్యాయులు రామకృష్ణ, నవీనతో పాటు జిల్లా అధికారులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






