20 August, 2026 | 7:30 PM

రైతులు శాస్త్రీయ పద్ధతులతో ప్రత్యామ్నాయ పంటలు

20-08-2026 06:06 PM

రైతులు శాస్త్రీయ పద్ధతులతో ప్రత్యామ్నాయ పంటలు

హుజురాబాద్, ఆగస్టు20: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంసింగపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఆత్మ (ATMA) ద్వారా రికగ్నిషన్ ప్రియర్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ సంచాలకులు పి సునీత మాట్లాడుతూ... సేంద్రియ పద్ధతులను అవలంబించి కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, వరి పంటలో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. తక్కువ చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఉండే ఆయిల్‌పామ్ వంటి వాణిజ్య పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని సూచించారు.

 తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా శాస్త్రీయ పద్ధతులు పాటించాలన్నారు. వరికి బదులుగా కంది, పెసర, మినుము, అలసంద, ఆముదం వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి విత్తనాలను సాగు చేసే రైతులు సంబంధిత డీలర్ల వద్ద నమోదు చేసుకోవాలని, ఇతరుల వద్ద నుంచి విత్తనాలు తీసుకున్న వారు AEOకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్త మహేష్,ఏటీఎం ఏ చైర్మన్ సమ్మిరెడ్డి, మండల వ్యవసాయఅధికారి భూమి రెడ్డి, ఏటీఎంఏ సమిరెడ్డి, ఏఈఓ సౌమ్య, ఏటీఎం స్రవంతి, సర్పంచ్ సమ్మయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.